Abdul Rahim


  రహీమ్ సాబ్   భారత ఫుట్ బాల్ చరిత్ర లో సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన పేరు. ఈయన పూర్తి పేరు సయ్యద్ అబ్దుల్ రహీమ్ అందరూ ముద్దుగా రహీమ్ సాబ్ గా పిలుస్తుంటారు. నాటి తరానికి సుపరిచితమైన నేటి తరానికి అపరిచితమైన వ్యక్తి. ఈయన 1909 ఆగష్టు 17 న హైదరాబాద్ నగరంలో జన్మించాడు. చిన్నతనం లోనే ఫుట్ బాల్ క్రీడ పట్ల ఆకర్షితుడై (అది అప్పుడప్పుడే నగరంలో ఫుట్ బాల్ కు ఆదరణ పెరుగుతున్న సమయం) చిన్న వయసు నుండే ఆటలోని మెళకువలు త్వరగా గ్రహించి అనతికాలంలోనే నగరంలో మంచి క్రీడాకారుడిగా పేరు  సంపాదించాడు. చదువుతూనే  ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఆడుతూ అనేక విజయాలు సాధించాడు. అయితే అనేక  ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఆటకు వీడ్కోలు పలికి కొద్ది రోజులు వ్యాయామ ఉపాధ్యాయునిగా నగరంలోని చిన్న పిల్లలకు, క్రీడాకారులకు ఫుట్ బాల్ శిక్షణ ఇచ్చేవారు. కొన్ని రోజులు గవర్నమెంట్ కాలేజ్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(GCPE-HYD) కు వైస్ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తించే వారు. తన ప్రతిభతో కొద్ది కాలంలోనే జాతీయ ఫుట్ బాల్ టీం కు ప్రధాన శిక్షకుడిగా నియమించబడడంతో రహీమ్ ప్రతిభ ఖండాంతరాలు దాటింది. ఆల్బెర్ట్ ఫెర్నాండో అప్పటి భారత్ జాతీయ ఫుట్ బాల్ కోచ్ 1964 బ్రెజిల్ లో జరిగిన ఒక వర్క్ షాప్ లో పాల్గొంటూ అక్కడి శిక్షణ పద్దతులు చూసి“ నేను 1956 కు ముందు రహీమ్ సాబ్ శిక్షణలో ఏవైతే నేర్చుకున్నానో అవే పద్దతులు ఇప్పుడు ఇక్కడ నేర్పిస్తున్నారు ” అంటే దాదాపు బ్రెజిల్ దేశం కన్న 10 సంవత్సరాల ముందే ఎలాంటి సాంకేతికత, ఆధునిక సదుపాయాలు లేని రోజుల్లోనే (కనీసం ఫుట్ బాల్ బూట్లు కూడా లేని రోజులు)  రహీమ్ సాబ్ తన దార్శనికత, అంకిత భావం, నిబద్ధత తో ఒక క్రమశిక్షణ కలిగిన శిక్షకునిగా క్రీడాకారులకు ఫుట్ బాల్ శిక్షణ ఇచ్చేవారు అని అర్థం అవుతుంది.

                     నగరంలో చిన్నపిల్లలకు, క్రీడాకారులకు నాన్ డ్రిల్లింగ్, వీక్ లెగ్ టోర్నమెంట్స్, ఫైవ్-ఎ-సైడ్, సెవెన్-ఎ-సైడ్ వంటి టోర్నమెంట్స్ ను నిర్వహించేవారు. జాతీయ టీం కు శిక్షణ ఇస్తూనే మరొక వైపు నగరంలో చిన్నపిల్లలకు క్షేత్ర స్థాయిలో(gross root level) స్పీడ్, ఎండోరెన్స్ పై ఎక్కువ  శిక్షణ ఇచ్చేవారు. ఇతని శిక్షణలో అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అందులో ప్రదానమైన వారు మన జాతీయ ఫుట్ బాల్ జట్టు కోచ్ లు అయినటువంటి  Amal Dutta, P.K.Benerjee, Nayeemuddin వంటి ఎందరో గొప్ప కోచ్ లను మనకు అందించాడు. ఇతని శిక్షణలో భారత ఫుట్ బాల్ టీం భారత ఫుట్ బాల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాలతో లిఖించదగిన ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించింది. అందులో ప్రధానమైనవి 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో 4వ స్థానం(ఆ ఘనత పొందిన మొట్టమొదటి ఆసియా దేశం), 1951 ఢిల్లీ లో జరిగిన మొదటి ఆసియా క్రీడలలోనూ, 1962 ఆసియా క్రీడలలో గోల్డ్ మెడల్స్ సాధించడం. అన్నింటికంటే తెలుగు వారు గర్వించదగిన విషయం మెల్బోర్న్ ఒలింపిక్స్ ఫుట్ బాల్ టీం లో 8 మంది హైదరాబాదీలు ఉండడం వారు అందరు కూడా రహీమ్ విద్యార్థులు కావడం మరవలేని జ్ఞాపకాలుగా చరిత్రలో నిలిచి పొయినాయి. రహీమ్ శిక్షణా పద్దతులు అధ్యయనం చేయడానికి ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా ఖండాలలోని అనేక దేశాల ప్రతినిధులు, క్రీడా పరిశీలకులు భారత్ కు వచ్చేవారు అంటే రహీమ్ శిక్షణ పద్దతులు ఎంతో గొప్పగా ఉండేవో అర్థమౌతుంది. అంతటి గొప్ప క్రీడాకారుడు మరియు కోచ్ 1963 జూన్ 11వ తేదిన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించాడు. ఎంతో గొప్ప వెలుగు వెలిగిన మన ఫుట్ బాల్ ఆయన మరణంతో తిరిగి నిద్రానావస్తలోకి వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. అయితే 20వ దశకం నుండి మన జాతీయ ఫుట్ బాల్ టీం అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ వస్తుంది.