Karanam Malleshwari

                    కరణం మల్లేశ్వరి ఆంధ్ర ప్రదేశ్ మరియు భారతదేశం గర్వించదగిన గొప్ప వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో వ్యక్తిగత ఒలింపిక్ మెడల్ సాధించి ఆ ఘనత పొందిన మొట్టమొదటి భారత మహిళ క్రీడాకారునిగా చరిత్ర సృష్టించింది. “ ఐరన్ గర్ల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ “ గా పేరుగాంచింది. ఆమె 1975  జూన్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీకాకుళం జిల్లా లోని ఆముదాలవలస లో జన్మించింది. ఆమె తండ్రి రైల్వే లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసేవారు. తనకు గల నలుగురు కుమార్తె లలో మల్లేశ్వరి ఒకరు. తన నలుగురు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో శిక్షణ పొందేవారు. మల్లేశ్వరి ఆముదాలవలసలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. పాఠశాలలో చదువుతూనే వారి అక్క తోపాటు ఆముదాలవలసలోని వెయిట్ లిఫ్టింగ్ అకాడమికి వెళ్ళే ది. అక్కడ తన అక్క నరసమ్మ కు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలం శెట్టి అప్పన్న శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఆ విధంగా మల్లేశ్వరి కి వెయిట్ లిఫ్టింగ్ పై ఆసక్తి ఏర్పడినది. పై గ తండ్రి ప్రోత్సాహం మరియు కుటుంబం క్రీడా నేపధ్యం ఆమెకు మరింత ఆసక్తి  కలిగించింది. 12 సంవత్సరాల వయసు నుండే మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొందేది. అనతికాలంలోనే మల్లేశ్వరి పట్టుదల, కఠోర సాధనతో మంచి వెయిట్ లిఫ్టర్ గా పేరు తెచ్చుకుంది. ఫలితంగా 1990 లో సాయి శిక్షణ కేంద్రానికి ఎంపికైంది. అక్కడ మరింత శిక్షణ తో 1991 లో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో 52kg విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.

                  ఆమెలోని ప్రతిభను గుర్తించిన కోచ్ లీయోనిడ్ అర్కడేవిచ్ తరనేన్కో (సోవియట్ – బెలారస్) మల్లేశ్వరి కి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతని శిక్షణ లో 1992-98 జరిగిన అన్ని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ (54kg ) పోటిలలో విజయలు సాధించింది. 1994-ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో ఒక గోల్డ్ మరియు ఒక సిల్వర్ తో రెండు పథకాలు సాధించింది. 1995- చైనా లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. 1994, 95- కొరియా మరియు 1996 జపాన్ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్స్ సాధించింది. 1996, 97 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో రెండు సిల్వర్ పతకాలు గెలుచుకుంది. 1999 కామన్వెల్త్ పోటిలలో 63kg విభాగాలలో కామన్వెల్త్ విమెన్ రికార్డ్స్ తో 3 పథకాలు సాధించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో 69 kg విభాగంలో 110 kg స్నాచ్ మరియు 130 kg క్లీన్ అండ్ జెర్క్ తో కలిపి మొత్తం 240 kg ల బరువు ఎత్తి కాంస్యం పథకం గెలవడం తో  వ్యక్తిగత ఒలింపిక్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత మహిళ క్రీడాకారునిగా చరిత్ర సృష్టించింది. భారత దేశం తరపున  వెయిట్ లిఫ్టర్ గా అనేక రికార్డ్స్ తో అంతర్జాతీయ పథకాలు సాధించింది. చివరకు వెయిట్ లిఫ్టర్ రాజేష్ త్యాగి ని పెళ్లి చేసుకొని తన అకాడమీలో భావి వెయిట్ లిఫ్టర్స్ కు శిక్షణ ఇస్తుంది.

కరణం మల్లేశ్వరి పొందిన అవార్డ్స్ :

 1994-95 – అర్జున అవార్డ్  

1995-96 – రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్

1999 – పద్మశ్రీ అవార్డ్.